Saturday, September 19, 2009

అబద్ధమాడాను.. అంతే...

చిన్నప్పటినుంచీ హాస్టల్లో ఉండి చదవటంవల్ల మరపురాని అనుభవాలు చాలానే ఉన్నాయి.ఓసారి మా ఫ్రెండ్స్ చాలామంది క్లాస్ కి వెళ్ళకుండా డార్మిటరీలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. హఠాత్తుగా మా హౌస్ మాస్టర్ కృష్ణవేణి మేడం రావటం చూసి అందరం బెడ్స్ కింద దాక్కున్నాం. మేడం ఎలా కనిపెట్టారో ఏమో తెలియదు కానీ లోపలికి రావటంతోనే బెడ్స్ కింద వెతకటం మొదలుపెట్టి అందరినీ కొట్టి క్లాస్ కి పంపించారు. కానీ నేను చివరి బెడ్ కింద ఉన్న పెట్టె వెనుక దాక్కోవటం వల్లా, ఎత్తు తక్కువ అవటం వల్లా మేడం నన్నుగమనించలేదు. బతికిపోయాను అనుకుంటూ మేడం వెళ్ళిపోయిన తర్వాత బయటికి వద్దామని చూద్దును కదా డార్మెటరీకి తాళం వేసి ఉంది. ఐనా నేను ఖంగారు పడలేదు. ఎందుకంటే నా బెడ్ పక్కనే ఉన్న కిటికీకి మధ్యలో ఒక ఊచ ఊడిపోవటం వల్ల మనిషి దూరటానికి వీలయ్యేంత స్థలం ఉండేది. నా సమయస్ఫూర్తికి నన్ను నేను ఒకసారి మెచ్చుకుని ఆ కిటికీలోనుండి బయటికి వచ్చి క్లాస్ కి వెళ్ళి చూద్దును కదా మేడం క్లాస్ లోనే ఉన్నారు. ఎక్కడికి వెళ్లావురా అని అడిగారో లేదో వెంటనే బి సెక్షన్ లో ఉన్న మోహన్ రావు దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అని చెప్పా. అంతే.. మేడం నన్ను దగ్గరకు పిలిచి ఆ చెంపా ఈ చెంపా వాయించేశారు. ఒక్క క్షణం నాకు ఏమీ అర్ధం అవ్వలేదు, నేను అబద్ధం చెప్పినట్టు ఆమెకి ఎలా తెలిసిందా అని.. తర్వాత ఆ సందేహం కూడా ఆమే తీర్చారు.
"నేను వాడు నిద్రపోతూ ఉంటే ఇప్పుడే లేపి వస్తున్నా" అన్న మేడం మాట విని నా మొహంలో నెత్తుటిచుక్క లేకుండా ఐపోయింది.

No comments:

Post a Comment