Saturday, September 19, 2009

ఆర్.కె.నారాయణ్ – ద డార్క్ రూం

ఈ పుస్తకం ఆర్.కె.నారాయణ్ మూడవ రచన(ప్రచురించబడిన). ఎప్పటిలాగే మాల్గుడి పట్టణ నేపథ్యంలో తిరుగుతుంది. ఒక చిన్న కుటుంబంలోని వ్యక్తుల మధ్య ఉండే సంబంధాలను సున్నితంగా చర్చిస్తుంది ఈ పుస్తకం.

కథ విషయానికి వస్తే రామని, సావిత్రి భార్యాభర్తలు. వారి సంతానం కమల, సుమతి మరియు బాబు. రామని పురుషాహంకారి. భార్యని కేవలం వంటింటి కుందేలుగా చూస్తూ ఉంటాడు. తను కష్టపడి సంపాదించి, డబ్బు ఇస్తుంటే తన భార్యకి మాత్రం ఇంటి పనులు చూసుకోవటంకంటే పెద్ద పనులేమున్నాయి అనుకుంటూ ఉంటాడు. ఇంట్లో అన్ని పనులు చేయటానికి కుదుర్చుకున్న మనిషి రంగా. అతనివంటకి రోజూ వంక పెడుతూ ఉంటాడు రామని. నువ్వెందుకు వంట చేయకూడదు అని సావిత్రిని తిట్టిపోస్తూ ఉంటాడు. ఇదంతా సావిత్రి దినచర్యలో ఒక భాగంగా మారిపోతుంది. అందుకని అతను ఏమన్నా నిశ్శబ్దంగా ఉంటుంది. సమాధానం చెప్తే ఎదురు చెప్పకూడదనీ, చెప్పకపోతే ఎందుకు చెప్పవనీ నిలదీస్తూ ఉంటాడు రామని. పిల్లలకి కూడా రామని అంటే భయం.
రామని ఎంగ్లేడియా ఇన్స్యూరెన్స్ కంపెనీలో సెక్రటరీగా పని చేస్తూ ఉంటాడు. మాల్గుడి జిల్లా మొత్తానికి అతనే ఆ కంపెనీ హెడ్. కొత్త సంవత్సరం సందర్భంగా కొందరు మహిళల్ని తమ కంపెనీలో చేర్చుకోవాలని ఎంగ్లేడియా కంపెనీ భావిస్తుంది. మాల్గుడి జిల్లా ఆఫీసు కి కూడా చాలామంది అప్లై చేస్తారు. వాళ్ళలో శాంతాబాయి అనే ఆమె ని చూసి మనసు పారేసుకుంటాడు రామని. ఆమె కోసం తమ ఆఫీసులో స్టోర్ రుం ని ఖాళి చేయించటమే కాక వాళ్ళ ఇంటిలో ఉన్న కొంత సామాను కూడా సమకూరుస్తాడు.

రోజూ క్లబ్ కి వెళ్ళి తర్వాత ఇంటికి వచ్చే రామని, ఒక రోజు ఇంటికి వచ్చే దారిలో ఆఫీసు దగ్గర ఆగుతాడు. లోపలికి వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో పడతాడు. ఐనా ఆఫీసులో అన్నీ సురక్షితంగా ఉన్నాయో లేదో చూడతానికి వెళ్తున్నా అని తనకి తాను సర్దిచెప్పుకుని ఆఫీసులోకి వెళ్తాడు. ఎవరో వచ్చిన అలికిడిని గమనించిన శాంతాబాయి తర్వాత అది రామని అని తెలుసుకుని లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. మొదట ఒకరిని ఒకరు అన్న, చెల్లెలు అనుకుంటారు. కొద్దిరోజుల్లోనే ఇద్దరూ బాగా దగ్గరవుతారు. రామని క్లబ్ నుంచి రోజూ తిన్నగా ఇంటికి వెళ్ళకుండా ఆఫీసుకి వెళ్ళే పరిస్థితికి చేరుకుంటాడు. కొన్నిసార్లు రోజుల తరబడి ఇంటికి వెళ్ళటం మానేస్తాడు. ఇద్దరూ కలిసి సినిమాలకి, షికార్లకీ తిరుగుతూ ఉంటారు.

ఒక రోజు వీళ్ళిద్దరినీ సినిమా హాల్లో చూసిన సావిత్రి స్నేహితురాలు గంగు ఆ విషయాన్ని సావిత్రికి చెబుతుంది. అప్పటిదాకా పని ఒత్తిడి వల్ల రోజూ ఆలస్యంగా వస్తున్నాడని భ్రమపడ్డ సావిత్రి ఆరోజు రామని ని శాంతాబాయి విషయం అడిగేస్తుంది. ఇద్దరి గొడవ పెద్దదై రాత్రికి రాత్రే సావిత్రి ఇంట్లోనుంచి వెళ్ళిపోతుంది. ఏంచేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేస్తుంది. అదే సమయంలో దొంగతనానికి వెళ్ళి పారిపోయి వస్తున్న మారి అనే దొంగ ఆమెని చూసి రక్షిస్తాడు.

ఇతను వృత్తిపరంగా తాళాలు, గొడుగులు మరమ్మత్తు చేసేవాడైనా ఆ సంపాదన సరిపోకపోవటంతో అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. మారి భార్య పొన్ని సావిత్రిని తమ ఇంటికి తీసుకువెళ్తుంది. పొన్ని తినటానికి ఏమిచ్చినా సావిత్రి తీసుకోదు. భర్త మీద ఆధారపడ్డందుకే తనను అతను హీనంగా చూస్తున్నాడనే అభిప్రాయంతో ఇక ఎవరిమీదా ఆధారపడకూడదనుకుంటుంది సావిత్రి. ఏ పనె చేయకుండా ఎవరి దగ్గరా ఏమీ తీసుకోనని మొండికేయటంతో ఆ ఊరి గుడి పూజారి దగ్గర పనికి కుదురుస్తాడు మారి. అక్కడే పని చేస్తూ పూజారి ఇచ్చే బియ్యం తో అన్నం వండుకుని తింటూ ఉంటుంది సావిత్రి. కానీ పిల్లల మీది బెంగతో ఎక్కువ రోజులు అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేస్తుంది. తల్లిని చూసి పిల్లలు ఆనందపడతారు. రామని మాత్రం భయం పోయి ఊపిరి పీల్చుకుంటాడు.

ఇలా రోజులు గడుస్తూ ఉండగా సావిత్రికి ఒక రోజు “తాళాలు, గొడుగులు బాగు చేస్తాం” అని అరుస్తున్న మారి గొంతు వినబడుతుంది. మొదట అతన్ని పిలిచి డబ్బిద్దామనుకున్నా తర్వాత ఎందుకో వద్దనుకుంటుంది. అలా అతని కేక వినబడేంతవరకూ అతని గురించే ఆలోచిస్తూ ఉందని చెప్తూ కథ ముగిస్తారు రచయిత,

ఈ పుస్తకం అప్పట్లో పెద్దగా ఆదరణకి నోచుకోలేదనే చెప్పాలి. మిగతా రచనలలో ఉన్నట్టు ఇందులో హాస్యం సృష్టించే పాత్రలు ఏమీ ఉండవు. అక్కడక్కడా పొన్ని, మారి ల పాత్రలు మాత్రం నవ్వు తెప్పిస్తాయి. స్త్రీలు స్వతంత్రంగా జీవించాలంటే వారికి చదువు అవసరం అనే అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తారు రచయిత.

No comments:

Post a Comment