Saturday, September 19, 2009

సుత్తి(యాడ్స్)

శుక్రవారం అంటే ఎంత విలువైనదో తెలియాలంటే ఒక సాఫ్టువేర్ ఇంజినీర్ ని అడిగి చూడాలి. అందరూ వీకెండ్ ఎంజాయ్ చేయటానికి వెళ్ళిపోతుంటే ఆఫీసులోనే ఆరోజు మొత్తం గడపాల్సి వస్తే ఎలా ఉంటుందో నన్ను అడిగితే నేను చెప్తాను. ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కుతుంటే సడెన్ గా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయ్. మనసు పొరల్లో ఒక్కో పేజీ తిరగేస్తూ ఉంటే అప్పుడు గుర్తొచ్చింది మేము ఎంతగా ఆదివారం కోసం ఎదురుచూసేవాళ్ళమో అని. ఆదివారం అంటే అదో పెద్ద పండగ మాకు. బడికి సెలవనే కాదు, ఆరోజు దూర దర్శన్ లో వచ్చే సినిమా కూడా చూడొచ్చు కదా. అవును.. దూర దర్శనే.. ఎందుకంటే అప్పట్లో మరి మా వూళ్ళో కేబుల్ టీవీ లేదు కదా… మాకు ఆ పదమే తెలియదు 1995 దాకా. అసలు మా వీధి మొత్తానికి ఉన్నది ఒకే ఒక టీవీ. అందులో మరి సినిమాలు వచ్చేది ఆదివారమే. సాయంత్రం నాలుగు గంటలకు మొదలయ్యే సినిమా కోసం అరగంట ముందునుంచే హడావిడి. టైటిల్స్ దగ్గరినుంచీ మిస్ అవ్వకుండా చూడాలనే ఆరాటం. మా అదృష్టం అప్పట్లో సినిమా మధ్యలో యాడ్స్ ఏమీ ఇచ్చేవాడు కాదు. హమ్మయ్య.. ఇప్పటికి అసలు విషయంలోకి వచ్చాను. యాడ్స్ గురించి చెప్పాలని మొదలుపెట్టి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయాను.

అప్పట్లో యాడ్స్ అంటే మాకు సినిమా మధ్యలో భోజనం చేసిరావటానికి దొరికే చిన్న బ్రేక్. అసలు మేము(మీలో చాలమంది కూడా) యాడ్స్ ని “సుత్తి” అని పిలిచేవాళ్ళం. ఇది చాలు మాకు యాడ్స్ అంటే ఉన్న ఫీలింగ్ చెప్పటానికి. కాని ఒక్కసారి కేబుల్ టీవీ ప్రతీ వూళ్ళోకి చొచ్చుకెళ్ళాక యాడ్స్ కి చాలా ప్రాముఖ్యత పెరిగింది. మధ్యలో దొరికే కొంత సమయాన్ని వినియోగించుకోటానికి అన్ని కంపెనీలు పోటీ పడ్డయి. దొరికే తక్కువ సమయంలొనే తమ ప్రొడక్ట్ గురించి చెప్పాల్సిరావటం ఒక సవాల్ గా మారింది కంపెనీలకి.దాంతో ప్రతీ సెకనూ అమూల్యమయ్యింది. ఇక్కడే యాడ్స్ రూపకర్తల సృజనాత్మకతకి పరీక్ష ఎదురయ్యింది. అప్పటినుచీ ఈ యాడ్స్ మరింత ఇంటరెస్టింగ్ గా మారాయి.కొన్ని యాడ్స్ చూస్తుంటే అసలు ఛానెల్ మార్చాలన్న విషయమే మర్చిపోతాం. అలాంటి యాడ్స్ లో కొన్ని :

నేను యాడ్స్ ని పరిశీలించటం మొదలుపెట్టాక నన్ను బాగా ఆకర్షించింది ఎయిర్ టెల్ యాడ్. రహమాన్ అందించిన మ్యూజిక్ అద్భుతం. ఆ మ్యూజిక్ వస్తుంటే ఎక్కడున్నా సరే పరిగెట్టుకు వెళ్ళిపోయేవాడిని. అసలు అద్భుతంగా ఉండే యాడ్స్ గురించి చెప్పాలంటే మొదటిగా మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల గురించే చెప్పాలి. హచ్ యాడ్ లో వచ్చే ముద్దులొలికే పిల్లాడు అంతకంటే ముద్దుగా ఉండే కుక్క పిల్ల.. అసలు ఎవరైనా ఛానెల్ మార్చగలరా… అసలు ఆ ఆలోచనైనా వస్తుందా? అయిడియా యాడ్ లో కులాల కుమ్ములాటలని తుంచేయటానికి అభిషేక్ బచ్చన్ మనుషులందరూ వాళ్ళ మొబైల్ నంబర్స్ తో నే సంబోధించబడాలనే తీర్పు ఇవ్వటం.. ఆహా ఎంత గొప్ప ఆలోచన.మెంటోస్ యాడ్ మొదటిసారి చూసి పడీ పడీ నవ్వాను.

ఈ మధ్య కొన్ని యాడ్స్ ద్వారా కేవలం వాళ్ళ ప్రొడక్ట్స్ గురించి చెప్పటమే కాకుండా ఏదైనా సందేశం అందించాలనే తపన కూడా కనిపిస్తుంది. వాటిలో మొట్ట మొదటిగా చెప్పుకోవాల్సింది “లీడ్ ఇండియా” యాడ్. కేవలం ఒక్క నిమిషం ఉండే ఈ యాడ్ ఎంతో గొప్ప సందేశాన్నిస్తుంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారనుకునే వాళ్ళు, అలాగే రాజకీయ నాయకులు, ప్రభుత్వోద్యొగుల మీద వ్యంగ్యాస్త్రం విసురుతుంది. టాటా టీ యాడ్ లో ఓటు అడగటానికి వచ్చిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయటం, దాని ద్వారా మన ఓటుహక్కు ప్రాముఖ్యతని తెలియజేయటం… అసలు ఆ యాడ్ రూపొందించిన వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేము. ఇలాంటిదే ఇంకో యాడ్ అయిడియా వాళ్ళాది. డబ్బు కట్టగలిగే స్థోమత లేని ఓ చిన్న పిల్ల చదువు ప్రమాదంలో పడే పరిస్థితి ఒక ఉన్నత భావాలున్న ఉపాధ్యాయుడిని ఆలోచింపచేసి ఒక అద్భుతమైన మార్గానికి కారణం అవుతుంది. ఇప్పుడు కొంచెం ఇదే విధంగా ఉండే కార్యక్రమాలు జరుగుతున్నాయని చదివాను.

యాడ్స్ లో నే చెత్త యాడ్స్ కూడా ఉన్నయ్. కాని వాటి గురించి మాట్లాడి అనవసరంగా వాటి విలువని పెంచటం నాకు ఇష్టం లేదు.

No comments:

Post a Comment