Saturday, September 19, 2009

ఆర్.కె.నారాయణ్-"ద ఫినాన్షియల్ ఎక్స్ పర్ట్"

నాకు స్వతహాగా ఆర్.కె.నారాయణ్ రచనలంటే చాలా ఇష్టం. ఇప్పటి దాకా ఆయన రచనలు చాలానే చదివాను.ఇక వరసగా వాటి గురించి రాస్తూ ఉంటాను. ఆర్.కె.నారాయణ్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చే పదం మాల్గుడి.మాల్గుడి అనేది తమిళనాడులోని ఒక చిన్న పట్టణం.ఈయన రచనలు అన్నీ మాల్గుడి పట్టణం చుట్టునే తిరుగుతాయి.మార్కెట్ వీధి,వినాయక్ ముదలియార్ వీధి,కబీర్ వీధి,లాలే ఎక్స్ టెన్షన్,మాల్గుడి స్టేషన్ ,మెంపి పర్వతాలు ఇవన్నీ మనకు తరచుగా కనిపించే పదాలు. నేను మాత్రం పూర్తిగా మాల్గుడితో లవ్ లో పడిపోయాను. మొదటగా “ద ఫినాన్షియల్ ఎక్ష్పర్ట్” గురించి చెబుతాను.

ఈ పుస్తకం కథ విషయానికి వస్తే మార్గయ్య అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. ఇథను మాల్గుడి చుట్టుపక్కలనుండి వచ్చే నిరక్షరాస్యులైన రైతులకి కో-ఆపరేటివ్ బ్యాంకు నుండి రుణాలు ఇప్పిస్తూ ఉంటాడు. అలా అని ఇతనికీ,బ్యాంక్ కీ ఎటువంటి సంబంధమూ ఉండదు. రుణం తీసుకోటానికి అవసరమైన పత్రాల వివరాలు,అప్లికేషన్ లు నింపటం, పాత రుణం ఉన్నప్పుడు ఇంకో రుణం తీసుకోవాలంటే బ్యాంకు వారికి ఎంత చెల్లించాలి అనే విషయాలను వివరిస్తూ వారి దగ్గర నుండి కొంత పుచ్చుకుని కాలం గడుపుతూ ఉంటాడు. రైతులంతా ఇతనికి పెట్టిన పేరు మార్గయ్య(మార్గం చూపేవాడు).అతని అసలు పేరు ఎవరికీ తెలియదు. ఒకరోజు బ్యాంక్ సెక్రటరీ మార్గయ్య చేసేది చట్ట విరుద్ధం అనీ, ఇంకొకసారి ఆ చుట్టు పక్కల కనిపిస్తే పోలీసులకి అప్పగిస్తాననీ బెదిరిస్తాడు. తనకు డబ్బు లేకపోవటం వల్లే అతను తనని అవమానించాడని త్వరగా డబ్బు ఎలా సంపాదించాలని గుడి పూజారిని అడుగుతాడు. దానికి ఆయన లక్ష్మీ దేవిని సంతృప్తిపరచాలని, అందుకు ఒక పూజ చేయాలనీ చెప్తాడు. పూజకి అవసరమైన తామర పువ్వు ని సంపాదించే సమయంలో అతనికి డాక్టర్ పాల్ పరిచయమవుతాడు.తనను తాను ఒక సోషియాలజిస్ట్,జర్నలిస్ట్ మరియు రచయితగా పరిచయం చేసుకుంటాడు డాక్టర్ పాల్.ఆ పూజ చేసిన తర్వాత కూడా ఎటువంటి తేడా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో అతను డాక్టర్ పాల్ ని మరలా కలవటం జరుగుతుంది. డాక్టర్ పాల్ తను రాసిన “బెడ్ లైఫ్” అనే పుస్తకాన్ని చదవమని మార్గయ్య కి ఇస్తాడు. ఆ రోజుల్లో అది చాలా సున్నితమైన అంశం కావటంతో దానిని చదవటానికి తటపటాయిస్తాడు. కానీ డాక్టర్ పాల్ తన పుస్తకం ముద్రణ హక్కులని మార్గయ్య కి వుచితంగా ఇచ్చేస్తాడు.దాని ముద్రణతో బాగానే డబ్బు సంపాదిస్తాడు మార్గయ్య. ఇది ఇలా ఉండగా మార్గయ్య కి ఒక కొడుకు బాలు. చాలా అల్లరివాడు. అతన్ని మెట్రిక్యులేషన్ పాస్ చేయించాలనే పట్టుదల మార్గయ్యది. కానీ బాలూకి మాత్రం చదువంటే అస్సలు పడదు. కొన్ని సంఘటనల నేపధ్యంలో బాలు ఇంట్లోనుంచి పారిపోతాడు.

ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలంటే వేరే ఏదినా వ్యాపారం చేయాలనే ఆలోచనతో “బెడ్ లైఫ్” హక్కులని తన వాటాదారుడైన ప్రింటర్ కి అమ్మేస్తాడు మార్గయ్య. తర్వాత డాక్టర్ పాల్ సహాయంతో బ్యాంకింగ్(చిట్ ఫండ్ అనుకోవచ్చు) వ్యాపారం మొదలుపెట్టి బాగానే డబ్బు సంపాదిస్తాడు. సడెన్ గా ఒకరోజు బాలు చనిపోయాడని మద్రాస్ నుంచి ఒక ఉత్తరం వస్తుంది.తన భార్య, ఊళ్ళో వాళ్ళ పోరు భరించలేక వివరాలు కనుక్కుందామని మద్రాస్ బయలుదేరి వెళ్తాడు. రైలులో పరిచయం అయిన ఒక పోలీసు సాయంతో బాలూని వెతికి పట్టుకుని మళ్ళీ ఇంటికి తీసుకు వస్తాడు. పెళ్ళి చేస్తే కానీ ఒక దారికి రాడని భావించి ఓ మంచి అమ్మాయిని చూసి బాలుకి పెళ్ళిచేస్తాడు. పెళ్ళైన కొన్నిరోజులకే వారితో వేరుకాపురం పెట్టిస్తాడు మార్గయ్య. వాళ్ళని తను ఇంతకుముందు ఒకరి అప్పుకింద స్వాధీనం చేసుకున్న బంగళాకి పంపిస్తాడు.

బాలు కొత్త ఇంటికి డాక్టర్ పాల్ ఎక్కువగా వెళ్తూ ఉండటం మార్గయ్యకి ఇష్టం ఉండదు. ఎలాగైనా బాలు తో డాక్టర్ పాల్ సాన్నిహిత్యాన్ని తగ్గించాలని అతనికి తన బ్యాంకింగ్ వ్యాపారానికి అవసరమైన కీలకమైన పని అప్పజెప్తాడు. తన వ్యాపారానికి కావలిసిన కస్టమర్లని వెతికి వారితో డిపాజిట్లు కట్టించే ఫనిని అప్పజెప్తాడు. స్వతహాగా జర్నలిస్ట్ అయిన పాల్ తనకు ఉన్న పరిచయస్తులని చాలామందిని మార్గయ్య దగ్గర డిపాజిట్లు కట్టేలా ఒప్పిస్తాడు. మార్గయ్య 20శాతం వడ్డీ ఇస్తాననటంతో చాలామంది అతని వద్ద డిపాజిట్లు కడతారు. కొద్దిరోజుల్లోనే అతను ఒక ప్రముఖవ్యక్తి అయిపోతాడు. తన తండ్రి ఆస్తిని చూసి బాలు కి దాని మీద ఆశ కలుగుతుంది. ఓరోజు తండ్రిని వాటా పంచమని అడుగుతాడు. కొడుక్కి సర్దిచెప్పినా వినకపోవటంతో, అతని మీద చేయి చేసుకుంటాడు మార్గయ్య. తర్వాత బాధపడి కొడుకుతో మాట్లాడాలని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కోడలు బాలు,డాక్టర్ పాల్ కలిసి చేసే నిర్వాకాల గురించి చెప్పటంతో ఆగ్రహిస్తాడు మార్గయ్య. డాక్టర్ పాల్ ని ఏంచేయాలా అన్న తికమకలో పడిపోతాడు. తనకు సాయం చేసిన వ్యక్తే తన కొడుకుని పక్కదారి పట్టిస్తుండటం జీర్ణించుకోలేకపోతాడు. అదే సమయంలో డాక్టర్ పాల్,బాలు ఇద్దరు అమ్మయిలతో కారులో వచ్చి బాలు ఇంటిముందు ఆగుతారు. ఆ సమయంలో డాక్టర్ పాల్ ని చూసి కోపం తట్టుకోలేక అతని మీద చేయి చేసుకుంటాడు. దాన్ని మనసులో పెట్టుకున్న డాక్టర్ పాల్ మార్గయ్య తనని కొట్టాడని, అతనికి బాలు విషయంలో సహాయం చేయాలనుకోవటమే తను చేసిన నేరం అనీ ఊరంతా ప్రచారం చేస్తాడు. అందరికీ మార్గయ్య మీద నమ్మకం పోవటంతో వారి వారి డిపాజిట్లు తీసుకెళ్ళిపోవటానికి మార్గయ్య ఇంటిమీద మూకుమ్మడిగా దాడి చేస్తారు. తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఇచ్చినా, ఇంకా చాలామంది మిగిలిపోతారు. ఏమీ చేయలేని పరిస్థుతుల్లో ఐ.పి పెట్టేస్తాడు. అతనికి ఉన్న ఆస్తులన్నింటినీ కోర్టు స్వాధీనం చేసుకుంటుంది బాలువాళ్ళు ఉంటున్న బంగళాతో సహా.తను ఉంటున్న ఇంటిని తప్ప మిగతావన్నీ పోగొట్టుకుంటాడు. చివరికి బాలు కూడా అదే ఇంటికి వచ్చేస్తాడు. “నా ఆస్తిని పంచమని అడిగావ్ కదా… అదే నా ఆస్తి..దాన్ని తీసుకుని రేపటినుండి నువ్వు బ్యాంక్ దగ్గరికి వెళ్ళు” అని ఓ మూల ఉన్న చిన్న పెట్టెని(అతను కో ఆపరేటివ్ బ్యాంక్ దగ్గర పనిచేసినప్పుడు ఉపయోగించినది.) చూపిస్తాడు. దానికి బాలు ఒప్పుకోడు. “సరే.. నేనే వెళ్తాను” అని మార్గయ్య అనటంతో కథ ముగుస్తుంది.

నారాయణ్ రచనా శైలి చాలా అందంగా ఉంటుంది. సున్నితమైన హాస్యం తో మనుషుల మనస్తత్వాలని కళ్ళకు కట్టినట్టు చూపించగలగటం ఆయన గొప్పతనం.
ఒక్క విషయం మాత్రం నాకు అర్థం కాలేదు. తన స్వంత రచన ని ముద్రించుకుంటే లక్షాధికారి అవుతాడని తెలిసీ దానిని మార్గయ్యకి ఇచ్చిన డాక్టర్ పాల్, బాలు విషయంలో ఎందుకలా ప్రవర్తిస్తాడో అర్థం కాదు. మొత్తం మీద నారాయణ్ మరోసారి తను ఎందుకు అంత ప్రముఖ రచయితో నిరూపించుకున్నారు.

No comments:

Post a Comment