ఇంటర్మీడీయెట్ రెసిడెన్షియల్ కాలేజ్ లో చదవటం అంత నరకం ఇంకొకటి ఉండదేమో.పొద్దున్నే కాలేజ్ కి వెళితే మళ్ళీ దెయ్యాలు తిరిగే టైంకి రూముకి వచ్చేవాళ్ళం.కొద్దిసేపు ఆరోజు ఎవడెవడు ఏమేమి చేశాడో మాట్లాడుకుని పడుకొనేటప్పటికి నైటు ఒంటిగంట దాటేది.ప్రశాంతంగా కొద్దిసేపు మాట్లాడుకుందాం అన్నా మా వార్డెన్ గాడు భయంకరమైన గొంతేసుకుని లైట్లు ఆఫ్ చేయమని చంపేసేవాడు. ఐనా సొల్లు కొట్టుకోటానికి లైట్లు ఎందుకులే అని అడ్జస్ట్ ఐపోయి లైట్ ఆఫ్ చేసి మా కార్యక్రమాలు కొనసాగించేవాళ్ళం. పొద్దున్నే మమ్మల్ని లేపటానికి మళ్ళీ ప్రత్యక్షం అయిపోయేవాడు. మాకు ఒక ఫ్లోర్ కి 20 రూములు ఉండేవి. ఒక్కోరోజు ఒక్కోచివర నుంచి మొదలుపెట్టేవాడు అందరిని లేపటం. మాది ఒక చివరి రూం అవటంతో రోజు కాక రోజు వాడి కార్యక్రమం మాతోనే మొదలయ్యేది. అంటే సగం రోజులు నిద్రలేవటంతోనే మాకు వాడి దర్శనమే అయ్యేది. అసలు నాకు నిద్రలేపుతాడని కాదు వాడంటే కోపం. బాల కృష్ణ తొడకొడితే ఆ సౌండ్ కి గుండాగి చస్తారో లేదో తెలియదు కానీ మా వార్డెన్ తలుపు గడియ కొట్టే సౌండ్ కి మాత్రం డెఫినెట్ గా గుండె ఆగినత పనయ్యేది. దానికి తోడు వచ్చీ రావటంతోనే ఫ్యాన్ ఆఫ్ చేసేసేవాడు. అసలే విజయవాడలో వేడికి చచ్చిపోతున్నాం అంటే వీడు ఫ్యాన్ ఆపగానే సస్పెన్స్ సినిమా క్లయిమాక్స్ అప్పుడు కరెంట్ పోతే ఎంత కోపం వస్తుందో అంతకు రెట్టింపు కోపం వచ్చేసేది.
ఇలాగే ఒకరోజు మనోడు అయిదింటికే వచ్చేసి భీకరమైన శబ్దాలు చేసేసి ఫ్యాన్ ఆఫ్ చేసి పక్క రూం వాళ్ళని లేపటానికి వెళ్ళాడు. ఆరోజు బాగా నిద్ర వస్తుండటంతో ఫ్యాన్ మళ్ళీ ఆన్ చేసుకొని నిద్రపోవటం మొదలెట్టాను. వాడు వచ్చి మళ్ళీ ఫ్యాన్ ఆఫ్ చేసి వెళ్ళిపోయాడు. మనం మళ్ళీ ఆన్ చేసి పడుకున్నాం. ఈసారి మనోడికి బాగా కోపం వచ్చినట్టుంది. వచ్చి తిట్లు లంకించుకున్నాడు. జీవితంలో అంతకుముందు ఎప్పుడూ అంత పొద్దున్నే ఎవరి చేతిలో తిట్లు తినకపోవటం వల్లేమో కానీ కోపం నషాళానికెక్కింది. మళ్ళీ వాడిముందే ఫ్యాన్ ఆన్ చేశాను. "ఐనా నేను ఎంతసేపు నిద్రపొతానో నీకు అనవసరం. ప్రేయర్ టైం కి కాలేజీలో లేకపోతే అప్పుడు మాట్లాడు" అని చెప్పి మళ్ళీ పడుకుందామని రెడీ అయిపోయా. అంతే... వాడి ఇగో హర్ట్ అయ్యింది."ఏంట్రా.. ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావ్, చీఫ్ వార్డెన్ కి కంప్లైంట్ చేస్తా" అన్నాడు. "ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నది నువ్వు నేను కాదు. ఐనా మాకు కూడా వచ్చు కంప్లైంట్ చేయడం" అని మళ్ళీ పడుకున్నా ఎలాగైనా వాడిమీద కంప్లైంట్ చేయాలని తీర్మానించేసుకుని. తర్వాత క్లాసుల సందడిలో ఆ విషయం మర్చిపోయాను. మధ్యలో టిఫిన్ బ్రేక్ లో ఒకసారి అర్జెంట్ గా ఆఫీస్ కి వచ్చి కలవమని అనౌన్స్ చేశారు. ఆఫీస్ వాళ్లకి మనతో ఏం పనబ్బా అనుకుంటూ అక్కడికెళ్ళాను. తర్వాత ఓ పావుగంట పాటు మనకు విపరీతమైన క్లాసు చీఫ్ వార్డెన్ చేతిలో. ఎందుకో మీకు విడమరిచి చెప్పక్కర్లేదనుకుంటా.
No comments:
Post a Comment