Saturday, September 19, 2009

ఆర్.కె.నారాయణ్ – ద వరల్డ్ ఆఫ్ నాగరాజ్

నేను చదివిన నారాయణ్ పుస్తకాలలో అత్యంత హాస్యభరితమైన పుస్తకం ఇదే అని చెప్పవచ్చు. ఇందులో ముఖ్య పాత్రధారులు నాగరాజ్ మరియు టిం.
కథ విషయానికి వస్తే నాగరాజ్ కబీర్ స్ట్రీట్ లో నివసిస్తూ ఉంటాడు. కబీర్ స్ట్రీట్ కుటుంబాలంటే చాలా పండితులనీ , గొప్పవాళ్ళనీ అందరి ఉద్దేశ్యం. నాగరాజ్ భార్య సీత. పొద్దున్నే ఆరు దాటక ముందే లేచి తన స్నేహితుడు జయరాజ్ ఫొటో స్టూడియో దగ్గర కొద్దిసేపు, ఆ తర్వాత కన్ని పాన్ షాప్ దగ్గర కొద్దిసేపు గడిపటం నాగరాజ్ దినచర్య. ఆ తర్వాత సాయంత్రం దాకా తన స్నేహుతుడైన కూమర్ చీరల షాపులో ఎకౌంట్స్ చూడటం అతని పని. స్వతహాగా ధనవంతుల కుటుంబం అవటంతో ఈ పనికి అతను ఏ మాత్రం డబ్బు తీసుకోడు. పైగా డబ్బు తీసుకుంటే తన స్వాతంత్ర్యానికి అడ్డని భావిస్తూ ఉంటాడు. ఇది కాక వేరే పనేమీ చేయకుండానే గడిపేస్తూ ఉంటాడు.
నాగరాజ్ అన్న గోపు. అతని భార్య చారు. వాళ్ళ కొడుకు టిం. తండ్రి చనిపోయే దాకా కలిసే ఉన్న గోపు, నాగరాజ్ తండ్రి చనిపోయాక గోపు పట్టుబట్టటంతో విడిపోతారు. తన వాటాగా ఎక్కడో ఒక పల్లెటూరిలో ఉన్న భూములని తీసుకుని నాగరాజ్ కి కబీర్ స్ట్రీట్ లో ఉన్న ఇంటిని ఇచ్చేస్తాడు గోపు. స్వతహాగా చిన్నప్పటి నుంచీ నాగరాజ్ కి గోపు అంటే భయం. అదే భయం తను పెద్దవాడయినా ఆ తర్వాత పెళ్ళి అయినా కూడా కొనసాగుతూనే ఉంటుంది. నాగరాజ్ కి పెళ్ళై ఎంత కాలమైనా పిల్లలు లేకపోవటంతో అన్న కొడుకు టిం అంటే చాలా ప్రేమ. గోపు విడిపోయేటప్పుడు టిం ని తన దగ్గర ఉంచమనీ, తనే అతన్ని చదివిస్తాననీ చాలా బతిమిలాడుతాడు. గోపుకి టిం ఒక్కడే కొడుకవటంతో దానికి ఒప్పుకోడు.

కాలగమనంలో టిం పెరిగి పెద్దవాడవుతాడు. నాగరాజ్ కి సంతానం కలగదు. ఒక రోజు సడెన్ గా పెట్టెతో తమ ఇంటికి వచ్చిన టిం ని చూసి ఆశ్చర్యపోతారు నాగరాజ్, సీత. కానీ లోలోపల చాలా ఆనందపడతారు. గోపు తిట్టడంతో ఇలా వచ్చేశాడని తెలుసుకుంటాడు నాగరాజ్. స్వతహాగా టిం మీద ఉన్న ప్రేమ వల్ల అతన్ని మళ్ళీ ఇంటికి వెళ్ళమని చెప్పలేకపోతాడు. కొన్ని రోజులకి గోపు వచ్చి టిం ని రమ్మని బతిమాలినా అతను వినకపోవటంతో అతను ఇలా మారిపోవటానికి కారణం నువ్వే అని నాగరాజ్ ని నిందిస్తాడు గోపు. టిం ఇక్కడే ఉండాలని నిర్ణయించుకోవటంతో ఆల్బర్ట్ మిషన్ కాలేజీలో చేర్పిస్తాడు నాగరాజ్. అతని కోసం ప్రత్యేకంగా తమ ఇంటిలో ఒక గదిని కేటాయిస్తాడు. ప్రారంభంలో కొన్ని రోజులు బాగానే గడిచినా రాను రానూ టిం ప్రవర్తన మారుతూ ఉంటుంది. పొద్దున్నే బయటకి వెళ్తే మళ్ళీ రాత్రికి కానీ ఇంటికి చేరుకోడు. టిం ప్రవర్తన చూసి అతన్ని నిలదీయమని నాగరాజ్ కి చెప్తుంది సీత. కానీ ఆ ధైర్యం చేయలేకపోతాడు.
ఇదిలా ఉండగా నాగరాజ్ కి నారద మహర్షి గురించి ఒక పుస్తకం రాయాలనే ఆశయం ఉంటుంది. రోజూ ఒక పుకారు పుట్టించకపోతే తల ముక్కలవుతుందన్న శాపం వల్ల నారదుడు రోజూ ఒక పుకారు సృష్టించేవాడనీ, ప్రతీ పుకారూ లోక కళ్యాణానికే దారి తీశిందనీ నాగరాజ్ ఉద్దేశ్యం. అందుకే నాగరాజ్ కి నారద మహర్షి అంటే అంత అభిమానం. నారద మహర్షి గురించిన సమాచారం కోసం చాలా కష్టపడుతూ ఉంటాడు. టాకెటివ్ మ్యాన్ సహాయంతో కావు పండిట్ దగ్గర శిష్యుడిగా చేరుతాడు. కానీ ఆయన నారద మహర్షి గురించిన విషయాలకంటే ఇతర విషయాల మీద మాట్లాడుతూ ఉండటంతో నాగరాజ్ కి చిర్రెత్తుకొస్తుంది. దాంతో ఆయన శిష్యరికం వదిలేసి తనే స్వంతంగా రాద్దామని నిర్ణయించుకుంటాడు. రచన కి అవసరమైన నోట్ బుక్స్ కోసం బారి అనే వ్యక్తి నడిపే స్టేషనరీ షాప్ కి వెళ్తాడు. బారి అలీఘర్ నుంచి వలస వచ్చి మాల్గుడి లో స్థిరపడ్డ వ్యక్తి.మాటల మధ్యలో బారి వాళ్ళ గ్రామ దైవం నారదుడనీ, నారదుని జీవితానికి సంబంధించి అతని వద్ద ఒక గ్రంధం ఉందనీ తెలుసుకుంటాడు. కానీ ఆ గ్రంధం బారి వాళ్ళ మాతృ భాషలో ఉండటంతో అతను చదివి తనకు వివరించేలా ప్రతిగా తనకు అవసరమైన నోట్ బుక్స్ అన్నీ అతని దగ్గరే కొనేలా ఒప్పందం చేసుకుంటాడు నాగరాజ్. ఒక రెండు వారాలు బాగానే గడుస్తాయి. ఆ రెండు వారాలు చెప్పిన విషయాలతో రెండు చిన్న పుస్తకాలు నిండిపోతాయి.
ఇదిలా ఉండగా ఒక రోజు టిం చదువు ఎలా సాగుతోందో కనుక్కుందామని కాలేజీ కి వెళ్ళిన నాగరాజ్ టిం అసలు కాలేజీకే రావటం లేదని తెలిసి నిర్ఘాంతపోతాడు. అంతే కాకుండా అతను న్యూ ఎక్స్టెన్షన్ లో ఉన్న “కిస్మత్” బార్ లో పని చేస్తున్నడని టాకెటివ్ మ్యాన్ ద్వారా తెలుసుకుంటాడు. ఇంకొందరు కూడా ఇదే విషయాన్ని నాగరాజ్ కి చెప్తారు. ఈ విషయం గురించి టిం ని అడగలేక, గోపు అడిగితే ఏం చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటాడు. భార్య సలహామేరకు గోపు కి చెప్పటానికే నిర్ణయించుకుంటాడు. కానీ అంతలో గోపు స్వయంగా నాగరాజ్ దగ్గరికి వస్తాడు. టిం కాలేజీ కి వెళ్ళటం లేదని తనకి తెలిసిందని నాగరాజ్ తో అంటాడు గోపు.టిం కి పిల్లనిస్తామని ఢిల్లీ నుంచి కొందరు వచ్చారనీ, టిం కి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నామనీ చెప్తాడు గోపు. టిం ని కూడా పెళ్ళికి ఒప్పిస్తాడు. పిల్లని చూసి ఆమె మరీ విదేశీయురాలిలా ఉందని, అమ్మయి టిం కి నచ్చకూడదనీ ప్రార్ధిస్తాడు నాగరాజ్. కానీ అమ్మాయి టిం కి మాత్రమే కాక గోపు కి, అతని భార్యకి కూడా నచ్చుతుంది. టిం కి సరోజ తో పెళ్ళవుతుంది. ఇద్దరూ నాగరాజ్ ఇంట్లోనే కాపురం పెడతారు. సరోజ కి హార్మోనియం వాయించే అలవాటు ఉంటుంది. కానీ ఆమె గాత్ర మాధుర్యం భరించలేనిదిగా ఉండటంతో నాగరాజ్ రచనకి ఇబ్బంది కలుగుతుంది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయుడిగా ఉండిపోతాడు. సరోజకి చెప్పటం కంటే తనే ఉదయాన్నే లేచి రచన కొనసాగిస్తే బాగుంటుందని ఉదయాన్నే లేవటం ప్రారంభిస్తాడు. కానీ ఆ ఆనందం కూడా అతనికి ఎక్కువ రోజులు మిగలనివ్వదు సరోజ. మామగారి నుంచి స్ఫూర్తి పొంది తను కూడా ఉదయాన్నే లేచి తన హార్మోనియం సాధన మొదలు పెడుతుంది. ఒక రోజు ఆ గాత్రాన్ని భరించలేక సరోజ ని మందలిద్దామని కోపంగా వెళ్ళిన నాగరాజ్ ఆమె తను పాడుతున్న పాట ఎలా ఉందని అడగటంతో ఏమీ చెప్పలేక వెనక్కి వచ్చేస్తాడు. తను పాడుతుండగానే మామగారు వెళ్ళిపోవటంతో అవమానం జరిగిందని భావించిన సరోజ, టిం కి ఈ విషయం చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. టిం సరోజని కూడా “కిస్మత్” లో గాయకురాలిగా పనికి కుదురుస్తాడు. వీళ్ళు ఇంట్లోనుంచి వెళ్ళిపోయారని తెలుసుకున్న గోపు టిం తో మాట్లాడతానికి “కిస్మత్” కి వెళ్తాడు. టిం అతనితో రానని తెగేసి చెప్పటంతో అవమానంతో, బాధతో తిరిగి తన ఊరికి వెళ్ళిపోతాడు. ఒక రోజు సరోజ విషయంలో బార్ మేనేజర్ తో గొడవ పడి అతన్ని కొడతాడు టిం. వాళ్ళు టిం ని ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. వేరే ఏ ఆధారం లేకపోవటంతో మళ్ళీ నాగరాజ్ దగ్గరికే వస్తారు. వీళ్ళు ఇంట్లోనుంచి వెళ్ళిపోయాక తన రచనని కొనసాగించవచ్చనుకున్న నాగరాజ్ కి ఆశాభంగమవుతుంది. నాగరాజ్ కి ఇక తన రచన కొనసాగించటం కష్టమని అర్థం అయ్యి రచన ఆలోచనను విరమించుకోవటంతో కథ ముగుస్తుంది.

ఈ పుస్తకం ఆద్యంతం పెదాలపై నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. ఇందులో అక్కడక్కడా మనకు కనిపించే టాకెటివ్ మ్యాన్ పాత్ర గురించి ఇంకొక పుస్తకం “ద టాకెటివ్ మ్యాన్” లో వివరంగా ఉంటుంది. “ద టాకెటివ్ మ్యాన్” పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం చదివితే ఒక వింత అనుభూతికి లోనవుతాం. టిం పేరు ని టాం అని ఎవరో పిలిచిన సందర్భంలో నాగరాజ్ కి కోపం వచ్చే సన్నివేశం, అలాగే గోపు అంటే నాగరాజ్ భయపడటం, ఆ తర్వాత సరోజ హార్మోనియం వాయించే సందర్భం లో నాగరాజ్ భావాలు నావుల పూవులు పూయిస్తాయంటే అతిశయోక్తి కాదు.

No comments:

Post a Comment